వేదాంతవాఙ్మయములో మనకు లభిస్తున్న గీతలలో శ్రీకృష్ణునిచేత చెప్పబడిన గీతలు మూడున్నాయి. ఇవి, భగవద్గీత, అనుగీత, ఉత్తరగీతలు. భగవద్గీత అందరకూ తెలిసినది, మరియు యోగ-వేదాంతశాస్త్రముల సారమని చెప్పబడుతుంది. అనుగీత యనునది మహాభారతములోని అశ్వమేధపర్వములోనిది, భగవద్గీతకు అనుచరమైనది. ఉత్తరగీత ఏ ప్రధానగ్రంథములోనిదో తెలియడం లేదు. బహుశా, స్వతంత్రమైన రచనయై యుండవచ్చును.
భగవద్గీతలో చెప్పబడిన విషయములను మరచిపోయిన అర్జునుడు, మరలా చెప్పమని శ్రీకృష్ణుని అడుగగా దానికి సంక్షిప్తముగా శ్రీకృష్ణుడిచ్చిన సమాధానమే అనుగీత, ఉత్తరగీతల విషయము. భగవద్గీతలో, కర్మ, భక్తి, జ్ఞాన, విజ్ఞాన, యోగశాస్త్రములు విస్తారముగా వివరింపబడినప్పటికీ, ఉత్తరగీతలో మాత్రం ఒక్క యోగసాధనా విధానము మాత్రమే ప్రముఖముగా కనిపిస్తున్నది. కనుక యోగాభ్యాసపరులకు ఈ గ్రంథము విందుభోజనం వంటిది. ఇది మా సంస్థనుండి వెలువడుతున్న 56 వ గ్రంథము.