తంత్రసాధనయైన శ్రీవిద్యోపాసన మీద చిక్కని గ్రాంధికభాషలో అనేక గ్రంథములున్నవి. వాటిలో సామాన్యులకు అర్థం కాని పదజాలం కనిపిస్తూ అంతుపట్టని మంత్రములను పూజలను తంతులను సూచిస్తూ చదువరులను గందరగోళంలో పడేస్తూ ఉంటుంది. అటువంటి శైలికి భిన్నంగా సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో తేలిక భాషలో శ్రీవిద్య యొక్క సాత్విక ఉపాసన విధానం మొత్తం ఈ పుస్తకంలో వివరించబడింది. ముఖ్యమైన కొన్ని ఉపనిషత్తులలోని మంత్రములను తేలిక భాషలో వివరిస్తూ శ్రీవిద్యకు గల వేద ప్రామాణికత ఇందులో చక్కగా నిరూపించబడింది. అంతేకాక శ్రీవిద్యలోగల నాలుగు ఆచారములను, మానవుడు దైవం వైపు అడుగులు వేయించే వాటి సాధనా విధానములను చదువరులకు పరిచయం చేయడం జరిగింది.
తంత్రసాధన, జగజ్జనని ఉపాసనలంటే లోకంలో ఉన్న భయాలను పటాపంచలు చేస్తూ, శ్రీవిద్యాసాధన మొత్తం సరళమైన పద్యం, అంత కంటే సరళమైన వచనంలో ఈ పుస్తకంలో వివరించబడింది. ఈ పుస్తకమును చదివిన తదుపరి, జీవితసాఫల్యతనిచ్చే అసలైన శ్రీవిద్యాసాధన వైపు చదువరులు ఆకర్షితులు అయితే రచయిత ఉద్దేశ్యం నెరవేరినట్లేనని భావిస్తాము.