ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అని నానుడి. ఒక్క ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మనిషి జీవితానికి కావలసిన సమస్తాన్నీ సూర్యోపాసన ఇవ్వగలదన్న విషయం మామూలు మనుషులకు తెలియకపోయినా, సూర్యోపాసకులకు చక్కగా తెలుసును. లౌకికమైన వరాలను మాత్రమేగాక, ఆధ్యాత్మికమైన వరాలను కూడా సూర్యోపాసన సునాయాసంగా ఇవ్వగలదు. ఎందుకంటే, సూర్యుడంటే అందరూ అనుకునేటట్లు ఒక అగ్నిగోళం మాత్రమే కాదు. పరబ్రహ్మము (Supreme God) నకు సూర్యబింబం ఒక ప్రతీక (symbol) అని మనకు తెలుసు.
సూర్యోపాసకులు జపించే మంత్రాలలో ‘మహాసౌరమ్’ మొదటిస్థానంలో ఉంటుంది. రెండవది ‘అరుణమ్’. మూడవది ‘ఆదిత్యహృదయం’. మొదటి రెండూ వేదంలోనివి. మూడవది రామాయణం లోనిది.
‘మహాసౌరమ్’ అనేది ఋగ్వేదంలో ఉన్న 65 మహా ప్రభావవంతములైన సూర్యమంత్రముల సమాహారం. వీటిని పదముగ్గురు వేదఋషులు తమ తపస్సాధనలో దర్శించారు. వారి దర్శనములు ఋక్కులుగా వెలువడ్డాయి. ఈ ఋక్కులు (మంత్రములు) వేదంలో ఒకేచోట లేవు. చెదురుమదురుగా ఉన్నాయి. ఆ విధంగా ఋగ్వేదంలో ఉన్న 16 చోట్ల నుండి సేకరింపబడిన ఈ మంత్రములు ‘మహాసౌర మంత్రపాఠమ్’, ‘మహాసౌరమ్’ అనే పేర్లతో వేలాది ఏండ్లనుండి మన దేశంలోని సూర్యోపాసకులచేత జపింపబడుతున్నాయి.
ఒక వృత్తానికి 360 డిగ్రీలుంటాయని మనకు తెలుసు. సూర్యభగవానుడు ఒక గోళంలాగే మనకు ఆకాశంలో దర్శనమిస్తాడు. అందుకే ఈ స్తోత్రానికి గల 65 మంత్రములకూ తెలుగులో 360 పద్యములను వ్రాశాను. ఇందులో ఒక్కొక్క పద్యమూ సూర్యభగవానునికి గల ఒక్కొక్క కిరణం అనుకోవచ్చు.