వేదములకు అనుబంధములైన అనేక చిన్న ఉపనిషత్తులలో ‘యోగ కుండలిని ఉపనిషత్’ ఒకటి. దీనికి ‘యోగకుండల్యుపనిషత్’ అని నామాంతరమున్నది. ఇందులో 3 అధ్యాయములు, 171 శ్లోకములున్నాయి. ఇది కృష్ణయజుర్వేదమునకు చెందిన ఉపనిషత్తు. దీనియందు కుండలినీ తంత్రము, ఖేచరీవిద్య చెప్పబడినవి.
హఠ, మంత్ర, లయ, రాజయోగముల సమాహారంగా ఇది మనకి గోచరిస్తుంది. కొన్ని తంత్రయోగ సాంప్రదాయ సిద్ధయోగమునకు మూలములు దీనిలో మనకి కనిపిస్తాయి.
తత్వశాస్త్రపరమైన, మేధోపరమైన చర్చకు దూరంగా ఉంటూ, సూటియైన సాధనా విధానములను బోధించడం యోగోపనిషత్తుల విధానము. ప్రాణనియమం, మనోనిగ్రహముల ద్వారా ఆత్మానుభూతిని పరబ్రహ్మానుభూతిని సరాసరి కలిగించడమే యోగ గ్రంథముల ఉపదేశము.