విజ్ఞాన భైరవ తంత్రమన్నది భైరవాగమము నందు గల రుద్రయామళ తంత్రమునందొక భాగము. ఇది జ్ఞానతంత్రము. అనగా, భౌతికములైన తంతులతో సంబంధము లేని ధారణా విధానములు దీనిలో చెప్పబడినవి. నూట పన్నెండు పైగా ధారణా విభాగములు దీనిలో ఉన్నవి. నేడు ప్రపంచమంతటా గురువులు భోధించుచున్నవి, ఉపాసకులు చేయుచున్నవి అయిన సాధనలన్నియు ఈ తంత్రమున లభిస్తాయి.
దక్షిణ భారతము కంటే ఉత్తర, తూర్పు భారతమున దీని ఉపాసకులు ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు ముఖ్యముగా, కాశ్మీర వీరశైవమునకు చెందిన త్రికసాంప్రదాయులగు కౌలాచారులకు ఇది ప్రామాణిక గ్రంథము. ఈ ధారణల పైన అనేకులు ఇప్పటికే ఎవరికి తోచినట్లుగా వారు వ్యాఖ్యానించి యున్నారు. నా సాధనానుభవములను బట్టి నాకర్థమైనట్లుగా నేనును ఈ వ్యాఖ్యానమును గావించాను.
ప్రాణ నిగ్రహము, మనో నిగ్రహము, ధారణ, ధ్యానములు అలవాటైన వారు మాత్రమే ఈ సాధనలను చేయగలరు. మిగతా వారికి ఊరకే చదివి ఆనందించుటకు మాత్రమే ఇవి ఉపయోగిస్తాయి. సాధకులకు ఇదొక గైడ్ బుక్ అని చెప్పవచ్చును. అనవసరములైన సిద్ధాంతములు, చర్చల జోలికి పోకుండా, ఆచరణాత్మకమైన ధారణా విధానములను సూటిగా భోదించుట ఈ తంత్రము యొక్క ప్రత్యేకత.
తంత్ర మార్గమునందు నడిచే ఇచ్ఛ ఉన్నవారు, సమర్థుడైన గురువును అన్వేషించి, ఆయన ద్వారా ఈ ధారణల యొక్క లోతుపాతులను గ్రహించి, వాటిని అభ్యసించినచో, అవి సూచించునట్టి అనుభవములను పొందగలుగుతారు.








