భగవద్గీతలో 700 శ్లోకములున్నప్పటికీ ఘంటసాల గారు పాడినవి, వారికి ముఖ్యములనిపించిన 108 శ్లోకములకు 158 కందపద్యములను రచయిత్రి శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయిగారు తెలుగులో చక్కగా వ్రాసినారు.
లౌకిక విషయములపైన పద్యములను చెప్పడం సాధారణమైతే, ఉన్నతభావములతో కూడిన ఆధ్యాత్మిక విషయములపైన చెప్పడం సమున్నతం. అందులోను ‘భగవతా నారాయణేన స్వయం’ సాక్షాత్తు భగవంతుడైన నారాయణునిచే చెప్పబడిన గీతాశాస్త్రశ్లోకములను పద్యరూపంలో తెనిగించడం మహోన్నతం.
గీతలోని శ్లోకముల యొక్క భావమును పద్యరూపములోనికి తెచ్చుటలో రచయిత్రి సఫలీకృతురాలైనది. మరందసమములైన ఆయా పద్యములను ఆస్వాదించినపుడు చదువరులు దీనిని గ్రహించగలుగుతారు.








