దక్షిణేశ్వర కాళికాలయంలో వెలసి, శ్రీరామకృష్ణులచే పూజింపబడి, ఆయనకు దర్శనమిచ్చి, మాట్లాడి, ఆయన పెట్టినది తిని, ఆయనతో ఆడుకున్న కాళికామాత, భవతారిణి యనే నామంతో ప్రసిద్ధగన్నది. అంటే, భవబంధములనుండి, కష్టముల నుండి, తరింపజేసే దేవతయని అర్థం. ఆమెకే మరొక పేరు తారాదేవి.
భవతారిణీమాతను ప్రస్తుతిస్తూ 27 సంస్కృత శ్లోకములతో, 260 తెలుగు పద్యములతో సాగిన ఈ రచన 2013 వ సంవత్సరములో ఆశువుగా ఉద్భవించినది. పేరుకు ఇదియొక దేవతాస్తోత్రమే అయినప్పటికీ, దీనిలోని ప్రతి శ్లోకమూ అనేక తంత్ర సాధనా రహస్యములను తనలో నిక్షిప్తం చేసుకొని ఉన్నది. జిజ్ఞాసువులకు, సాధకులకు, తంత్రాభిమానులకు ఈ కృతి ఆనందాన్ని కలిగిస్తుందని మా ఆకాంక్ష.