శ్రీ దత్తాత్రేయ యోగ శాస్త్రమను ఈ గ్రంథం వ్రాయబడిన కాలము ఎప్పటిదో తెలియదు. కానీ ఆ కాలమున ఉన్నట్టి వివిధ యోగ సాంప్రదాయములను ఒకచోట వివరించే ప్రయత్నం ఈ గ్రంథమున మనకు దర్శనమిస్తుంది. ఈ క్రమమున దీనియందు హఠ, లయ, మంత్ర, రాజయోగముల లఘు వివరణ ఇవ్వబడినది. వీనిలో హఠయోగమునకు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వబడినది. దీనియందు సాంకృతియను యోగినుద్దేశించి దత్తాత్రేయులు చెప్పినట్లుగా అనేక యోగ రహస్యములు ఇవ్వబడినవి.
దత్తాత్రేయులు త్రిమూర్తి స్వరూపులని నమ్మకము. ఈయన మహా జ్ఞాని మాత్రమే కాక మహా యోగి కూడా. ఈయన పరశురామునికి శ్రీవిద్యనుపదేశించెనని గాధ కలదు. అటులనే సిద్ధ సాంప్రదాయ అవధూత సాంప్రదాయమునకు కూడా ఈయన ఆద్యుడని నమ్మకములున్నవి. కొన్ని యోగ, తంత్ర సాంప్రదాయములు ఈయన్ను సాక్షాత్తు పరబ్రహ్మముగా భావిస్తాయి.
అన్ని యోగ గ్రంథముల వలనే ఇది కూడా సాధన వివరములను క్లుప్తముగా చెప్పిన పిదప సమర్ధుడైన గురువు వద్ద వీటిని అభ్యసించవలెనని చెప్పినది. ఇది సత్యమే. ఆధ్యాత్మిక సాధన అన్నది గురుముఖతా నేర్చుకోవలసినదే అయి ఉన్నది. ఎందుకనగా దాని యందలి రహస్యములన్నింటినీ పుస్తకములలో వివరించుట సాధ్యము కాదు.
ఈ పుస్తకమును చదివిన వారు ఆధ్యాత్మిక సాధన వైపు ఆకర్షితులైనచో మా కృషి ఫలించినదని భావిస్తాము.