అధర్వణ వేదంలోనూ, కృష్ణయజుర్వేదంలోనూ లభిస్తున్న ‘యోగతత్త్వోపనిషత్’ అనే ఈ ఉపనిషత్తు యోగసాంప్రదాయం గురించి విస్తృతంగా చర్చించింది.
కృష్ణయజుర్వేదంలోని ఉపనిషత్తులో మధ్యయుగాల నాటి వైష్ణవభావములు కొంచం కలిసి కన్పిస్తున్నాయి. అంతేగాక, హఠయోగ ప్రామాణిక గ్రంధముల నుండి కొన్ని శ్లోకములను సంగ్రహించి దీనిలో కలిపినట్లుగా కనిపిస్తున్నది. మధ్యయుగాలలో, హఠయోగ విధానాలు అనేక యోగ తంత్ర గ్రంధములలో కలసిపోయాయి. అదే వరుస ఈ ఉపనిషత్తులో కూడా కనిపిస్తుంది.
అయితే, తనవైన కొన్ని ప్రత్యేక యోగవిధానములను ఈ ఉపనిషత్తు ఉపదేశిస్తున్నది. అధర్వణవేదంలో అయితే, ప్రాచీనకాలపు ఓంకారసాధన దర్శనమిస్తున్నది. యజుర్వేదభాగంలో, ‘పంచభూతధారణ’ అనే ప్రత్యేక యోగక్రియ కనిపిస్తున్నది. ఈ విధంగా ఈ ఉపనిషత్తుకు తనవైన కొన్ని ప్రత్యేకతలున్నాయి.