‘సవిత’, ‘సావిత్రి’ అనే పదములు ఈ ఉపనిషత్తులో మనకు గోచరిస్తాయి. రెండునూ సూర్యభగవానుని సూచించేవే అయినప్పటికీ, వీటి అర్థములలో భేదమున్నది. సవిత యొక్క శక్తికే సావిత్రి అని పేరు. అంటే సూర్యుని యొక్క తేజస్సని అర్థం. మిట్టమధ్యాహ్నం పూట మండుతున్న సూర్యునకు ‘సవిత’ యని, తీక్షణమైన ఆయన తేజస్సుకు ‘సావిత్రి’ యని పేర్లున్నాయి. గాయత్రీ ఉపాసనలో, ఉదయకాల సూర్యుని వెలుగుకు గాయత్రి యని, మిట్టమధ్యాహ్నపు వెలుగుకు సావిత్రియని, సాయంకాలపు వెలుగుకు సరస్వతియని పేర్లున్నాయి.
గాయత్రీ మంత్రార్థమును విశ్వవ్యాప్తమైన అధ్యాత్మికకోణంలో అవిష్కరించడం ఈ ఉపనిషత్తు యొక్క మహాత్యం. ఆకలిదప్పులను దూరం చేసే ‘బలాతిబల విద్య’ ఈ ఉపనిషత్తుకు అనుబంధంగా చెప్పబడింది.