ఇది పేరుకు ఒక దేవతా స్తోత్రమే అయినప్పటికీ ఇందులోని ప్రతి శ్లోకమూ, ప్రతి పద్యమూ ఒక అంతరిక తంత్రసాధనా విధానమును తనలో పొందుపరచుకొని ఉన్నది. ఈ విషయమును సూక్ష్మగ్రాహులైన చదువరులు తేలికగా గ్రహించగలరు. ఆ కోణంలో గమనిస్తే, ఈ చిన్ని పుస్తకం ఎన్నో రహస్య తంత్రసాధనల సమాహారంగా గోచరిస్తుంది. జగన్మాత అనుగ్రహానికి పాత్రులయ్యే దారులు చూపిస్తుంది.
అవతార పురుషుల, మహనీయుల మాతృమూర్తులను పూజించే ఆచారం ప్రతిదేశంలోనూ ప్రతి మతంలోనూ ఉన్నప్పటికీ, సాక్షాత్తూ భగవంతుడినే మాతృమూర్తిగా ఆరాధించే విధానం మన భారతదేశపు ప్రత్యేకత. దైవాన్ని తండ్రిగానూ పూజింపవచ్చు. తల్లిగానూ పూజింపవచ్చు. రెండవ విధానంలో చనువు, సౌలభ్యతలు ఎక్కువగా ఉంటాయి. కనుక దైవాన్ని మాతృమూర్తిగా ఉపాసించే ఆచారం మన దేశంలో అతిప్రాచీన కాలం నుంచీ ఉన్నది. అలాంటి ఉపాసనలలో విశిష్టమైనట్టిది శ్రీవిద్యోపాసన.
ఒకే దైవం జగజ్జననిగా ఆరాధింపబడేటప్పుడు, ఆయా సాధకుల ఉపాసకుల వ్యక్తిగత తత్త్వములను బట్టి, వారివారి మానసిక సంస్కారములను బట్టి సాధనా మార్గములో వారివారి దారులను బట్టి ఎన్నో రకాలైన పేర్లతో విరాజిల్లుతూ వారిని ఆయా రూపములలో కరుణిస్తూ ఉంటుంది.
కాళీ, తారా, భువనేశ్వరీ, త్రిపురసుందరీ, పార్వతీ, లక్ష్మి, సరస్వతీ, గాయత్రీ, దుర్గా, చండీ, చాముండీ, బగలాముఖీ, చిన్నమస్తా, ధూమవతీ, కామాక్షీ, మాతంగీ, త్రిపురభైరవీ మొదలైన అసంఖ్యాకములైన పేర్లతో సాధకులు అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటారు. వీరందరూ వేర్వేరు దేవతలు కాదు. ఒకే జగన్మాత యొక్క వివిధములైన రూపములే వీరందరూ. వీరిలో ఎవరిని ఉపాసిస్తున్నప్పటికీ మూలదేవత యైన ఆద్యాశక్తియే వీరందరి ద్వారా ప్రకటమౌతున్నదన్న విషయాన్ని ఉపాసకుడు మరువరాదు. అలా మరచిపోయి వీరందరూ వేర్వేరు దేవతలని తలచిన మరుక్షణం ఆ ఉపాసన తప్పుదారి పడుతుంది.
దశమహావిద్యలలో ప్రధాన దేవత కాళి. కాళీతత్త్వమును అర్థం చేసుకోలేని కొందరు ఆమెను తామసిక దేవతయని, బలి కోరుతుందని భావిస్తూ, భయపడుతూ ఉంటారు. కాళి బలికోరే మాట వాస్తవమే కానీ ఆమె కోరునది జంతువుల బలిని కాదు. నీలోని జంతుప్రవృత్తిని, నీలోని పశుప్రవృత్తిని అమ్మ బలిగా కోరుతుంది. నీలోని అహంకారాన్ని బలిగా కోరుతుంది. ప్రతిగా నీకు దివ్యత్వాన్ని అందిస్తుంది. ఈ విషయం అర్థంకాని అజ్ఞానులు అమ్మకు పక్షులను, జంతువులను బలిచ్చి, వాటిని వండుకొని తింటూ ఉంటారు. ఇది దట్టమైన అజ్ఞానం తప్ప ఇంకేమీ కాదు.
భగవదవతారమైన శ్రీరామకృష్ణులు తనను తానే ఆ విగ్రహమూర్తిలో ఆలోకిస్తూ, తనను తానే ఉపాసించుకున్న భవతారిణి కాళికామాతయే ఈ కృతిలో ప్రార్థింపబడిన తారాదేవి. ఆమె శీఘ్ర వరప్రదాయిని. ఇహపరములను తన భక్తునికి అలవోకగా అందించగల మాతృమూర్తియే మహాకాళి.
సత్త్వరజస్తమాది త్రిగుణములు ఆమెచే సృష్టించబడినవే. పంచభూతములు ఆమెచే సృష్టించబడినవే. అంతేకాదు ఆయా గుణములుగా భూతములుగా విరాజిల్లుచున్నది తానే. గుణాశ్రయీం గుణమయీం నారాయణీ నమోస్తుతే అని కీర్తిస్తుంది దేవీ మహాత్మ్యం.
తంత్రమున పశుభావము, వీరభావము, దివ్యభావములను మూడు విభాగములు ఉన్నవి. మానవునిలో గల తమస్సు, రజస్సు, సత్త్వము అనబడే మూడు గుణభేదములే ఈ మూడు విభాగములు. ఎవరెవరిలోని గుణాధిక్యతను బట్టి వారు వారు ఆయా సాధనలను ఆచరించాలి. ఆయా ఉపాసనా మార్గములలో ప్రవేశించాలి. ఇంద్రియాకర్షణలు ఎక్కువగా కల్గి భౌతికభోగముల పైన ఎక్కువ మక్కువ కలిగినవారు పశుభావముతో మొదలు పెట్టి క్రమేణా సాత్త్విక మార్గము వైపు ప్రయాణించాలి. అహంకారము, దర్పము, గర్వములు ఎక్కువగా గల దాంభికులు వీరభావముతో మొదలు పెట్టి సత్త్వము వైపు పురోగమించాలి. శాంతస్వభావులూ, ఇంద్రియలౌల్యము చాలా తక్కువగా గల సాత్త్వికులకు దివ్యభావ సాధనలు వెంటనే అచ్చివస్తాయి. వెరసి మానవులలో గల అంతరిక తారతమ్యములను బట్టి ఈ మూడు మార్గములూ వారికి జగన్మాత సాన్నిధ్యానికి దారులు చూపిస్తాయి. ఎవరెక్కడ మొదలు పెట్టినా, అక్కడే ఆగిపోకుండా, ఉన్నత స్థితులవైపు ప్రయాణించాలి. దానికి ఒక సద్గురువు యొక్క మార్గదర్శనం అవసరం అవుతుంది. సద్గురువూ నచ్చిష్యుడూ ఒకచోట కలసినప్పుడు వారిపైన జగన్మాత అనుగ్రహం అనంతంగా వర్షిస్తుంది. వారి ద్వారా అమ్మ తానే ప్రకటమౌతుంది.
ఈ పుస్తకములో పైన వివరింపబడిన మూడు విధములైన సాధనలూ సూక్ష్మముగా వివరింపబడినాయి. ఆయా శ్లోకములు/పద్యముల వద్ద సూక్ష్మగ్రాహులు ఆయా వివరములను గ్రహించగలరు.
లోకంలో నేడు ఒక విచిత్రమైన పోకడ కనిపిస్తున్నది. లౌకికమైన పనులు నెరవేర్చుకొనుటయే దశమహావిద్యల ప్రయోజనమన్న భ్రమను నేడు జనులలో కొందరు దాంభిక గురువులు పెంచి పోషిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. దశమహా విద్యలు తంత్రసాధనలు. తంత్రం యొక్క పరమార్థం సాధకుని శరీరంలో శివశక్తి సంయోగాన్ని సిద్ధింపజేయడమే. తత్ఫలితంగా సాధకుడు పూర్ణసిద్ధిని అందుకొని, భూమిపైన నడయాడే దేవతగా భాసిల్లగలడు. అత్యున్నతమైన ఈ స్థితిని పొందడమే మహావిద్యల పరమార్థము. అంతేగాని కోర్టు కేసులు గెలవడానికి, పెళ్ళిళ్ళు కావడానికి, ఉద్యోగాలు రావడానికి, అప్పనంగా డబ్బులు సంపాదించడానికి, రోగాలు తగ్గడానికి మొదలైన క్షుద్ర ప్రయోజనాలకు దశమహావిద్యలను ఉ పయోగించుట చాలా నీచమైన పని. ఈ విధంగా జగన్మాత అనుగ్రహాన్ని పొందడం ఎన్నటికీ సాధ్యం కాదు. చక్రవర్తి దర్బారులో ప్రవేశించి వంకాయలు కోరుకున్నట్లుగా ఇది ఉంటుంది. దైవం దగ్గర ఏ విధమైన కోరికలు ఎలా కోరుకోవాలో కూడా తెలియని హీనస్థితిలో మానవులు నేడు ఉన్నారు. వారికి నేర్పే గురువులూ అలాగే ఉన్నారు.
జగజ్జనని అనుగ్రహాన్ని పొందటమే సాధకుని పరమావధి. మనకు ఏది ఎప్పుడు ఇవ్వవలెనో అమ్మకు తెలియదా? అచంచలమైన విశ్వాసంతో ఉంటూ, మనల్ని మనం శుద్ధసాత్త్వికమైన సాధనామార్గంలోకి మలుచుకుంటూ ఉంటే, మనకు ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు తానే జగజ్జనని ప్రసాదిస్తుంది. అహంకారమును అర్పణ గావించి, నిష్కల్మషమైన హృదయంతో ఉపాసించే వారిని జగన్మాత ఎల్లప్పుడూ వెంట నిలచి రక్షిస్తూ ఉంటుంది. ఇది నా ఒక్కడి అనుభవమేగాదు, నిజమైన సాధకుల అందరి అనుభవమూ ఇదే. ఈ తారాస్తోత్ర ధ్యానం సాధకులకు ఆత్మోన్నతిని కలిగించాలని భవతారిణి కాళీ మాతను ప్రార్థిస్తున్నాను.